ప్రభుత్వ సేవలు పొందేందుకు, గుర్తింపు నిర్ధారణకు అత్యంత ప్రామాణికమైనది ఆధార్. ఆధార్ వివరాలను అప్‌డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ ప్రస్తుతం ఉచితంగా సౌలభ్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉచిత సర్వీస్ గడువు సెప్టెంబర్ 14తో ముగుస్తుంది. ఇప్పటికే యూఐడీఏఐ పలుమార్లు ఈ గడువును పొడగించింది. దీంతో మరోసారి పెంచుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. కాబట్టి ఉచితంగా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవాలనుకునేవారు గడువు ముగిసేలోగా అప్‌డేట్ చేసుకోవడం మంచిది.
కాగా ఆధార్ ఉచిత అప్‌డేట్ గడువును యూఐడీఏఐ అనేకసార్లు పొడిగించింది. మరోసారి పొడగింపుపై ఇప్పటివరకు స్పష్టత లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న గడువును జూన్ 14న మూడు నెలలపాటు పెంచింది. అంతకుముందు గతేడాది డిసెంబర్ 15 నుంచి ఈ ఏడాది మార్చి 14 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా యూఐడీఏఐ మార్గదర్శకాల ప్రకారం వినియోగదారులు ప్రతి 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. తద్వారా చిరునామా, ఇతర వివరాలు అప్‌డేట్ అవుతుంటాయని, ప్రభుత్వ పథకాలను పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాబోవని యూఐడీఏఐ పేర్కొంది.