Gujarat Bridge Collapse: గుజరాత్‌లో వడోదర మరియు ఆనంద్ జిల్లాలను కలుపుతున్న గంభీర వంతెన సమీపంలో మహిసాగర్ నదిపై మంగళవారం ఉదయం జాలరి నరేంద్ర మాలి తన సహచరులతో కలిసి వేటలో ఉన్నాడు. అప్పట్లో వారికి ఆ పరిసరాల్లో అనుమానాస్పద శబ్దాలు వినిపించాయి. వెంటనే వారు వంతెన వైపు చూసినప్పుడు షాక్‌కు గురయ్యారు. వంతెనలో భాగం ఒక్కసారిగా కూలిపోయింది, దానిపై ప్రయాణిస్తున్న వాహనాలు వరుసగా నదిలో పడిపోతున్నాయి. “వాహనాలు ఒకదానికొకటి పడిపోతున్నాయి. మేము వెంటనే మా పడవలను మళ్లించి వారిని కాపాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం” అని మాలి చెప్పారు. రెండు ట్రక్కులు, ఒక కారు, ఒక పికప్ వ్యాన్ మరియు కొన్ని ద్విచక్ర వాహనాలు నదిలో పడిపోయినట్లు ఆయన వివరించారు. ఈ విషాదకర ఘటనలో ఎనిమిది మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ” ప్రయాణికులను రక్షించలేకపోయాం” అంటూ ఆయన విచారం వ్యక్తం చేశారు.
ఈ ఘటన పాలనా నిర్లక్ష్యతకు మచ్చుతునకగా నిలుస్తోంది. 1985లో నిర్మించబడిన ఈ వంతెనకు ఇప్పటికే 40 ఏళ్లు కావడంతో, ఇది ఎప్పుడైనా విపత్తుకు దారితీయవచ్చని కొంతకాలంగా స్థానికులు హెచ్చరిస్తున్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే చైతన్యసింహ్ జాలా సిఫార్సు మేరకు కొత్త వంతెన నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. సర్వేలు నిర్వహించి ప్రణాళికలు సిద్ధం చేసినప్పటికీ, ప్రస్తుతం ఉన్న వంతెనను మరమ్మతులు చేసి తిరిగి ట్రాఫిక్‌కు తెరిచారు. అయితే వాహనాలు దాటుతున్న సమయంలో వంతెన బలంగా కంపించేది అని స్థానికులు చెబుతున్నారు, ఇది ప్రమాద సూచకంగా కనిపించిందని వారు పేర్కొన్నారు.