ప్రతి రోజూ ఉదయాన్నే అందరం గుడ్ మార్నింగ్ చెప్పుకోవడం సర్వసాధారణం. ముఖ్యంగా పాఠశాలల్లో అయితే ఈ పదం తప్పనిసరిగా వినియోగిస్తుంటారు. అయితే ఇది ఇంగ్లీష్ పదమని, కొందరు తెలుగులో శుభోదయం అని చెబుతుంటారు. ఇది ఇలా ఉంటే. ఈ విషయంలో ఓ రాష్ట్రం కీలక ఆదేశాలను జారీ చేసింది. ఆగష్టు 15 స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునేందుకు దేశ ప్రజలందరూ సిద్ధమయ్యారు. ఈసారి పండగను ఘనంగా జరుపుకునేందుకు అన్నీ రాష్ట్రాలు సర్వం సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన విడుదల చేసింది. ఆగస్టు 15 నుంచి అన్ని పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ‘గుడ్ మార్నింగ్’ బదులుగా ‘జైహింద్’ చెప్పేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఈ మార్పును తప్పనిసరి చేసింది.
విద్యార్థుల్లో దేశభక్తి, ఐక్యతను పెంపొందించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ వివరించింది. “జై హింద్” అని నినదించడంతో దేశ గొప్ప చరిత్ర పట్ల గౌరవం ఉండేలా విద్యార్థులకు స్ఫూర్తినిస్తుందని అధికారులు తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ సుభాశ్ చంద్రబోస్ జైహింద్ నినాదంతో ప్రజలను ఒక్కటి చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే ఇక స్వాతంత్య్రానంతరం భారతదేశ సార్వభౌమాధికారం, భద్రత పట్ల తమ నిబద్ధతకు చిహ్నంగా దేశ సాయుధ బలగాలు కూడా ఈ నినాదాన్ని స్వీకరించాయి.
.