వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో వరదలు విషాదాన్ని మిగిల్చాయి. ఇప్పటికే చాలామంది సర్వం కోల్పోయి నిరాశ్రయులయ్యారు. మరికొంత మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ వరదల వల్ల ఏపీలోని విజయవాడ, గుంటూరు ప్రాంతాలు ఎక్కువగా నష్టపోయాయి. ఇక ఈ వరదల ప్రభావం వల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఈ క్రమంలోనే వదర బాధితులను ఆదుకునేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారు.
తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సీఎం సహాయనిధికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.కోటి విరాళాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరుగుతున్న వరద భీభత్సం నన్ను ఎంతగానో కలచివేసింది. అతి త్వరగా ఈ విపత్తు నుంచి తెలుగు ప్రజలు కోలుకోవాలని నేను ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా. వరద విపత్తు నుండి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకి సహాయపడాలని నా వంతుగా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యమంత్రి సహాయ నిధికి చెరొక 50లక్షల విరాళం గా ప్రకటిస్తున్నాను, అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేశారు.