హైదరాబాద్: శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌లోని 12 రేడియల్ క్రెస్ట్ గేట్లలో పది గేట్లను తెరిచారు. మంగళవారం రాత్రి నుంచి గేట్ల ద్వారా 2.75 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహాన్ని వదులుతున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ మరియు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ వంటి ఇతర వనరులకు కూడా ప్రాజెక్ట్ నుండి నీటిని తీసుకుంటారు. కుడి, ఎడమ ఒడ్డున ఉన్న హైడల్ యూనిట్లు పూర్తి సామర్థ్యంతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఎగువప్రాంతాల నుంచి నిరంతరాయంగా భారీ వరద వస్తుండడంతో మంగళవారం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎగువ నుంచి మరింత వరద కొనసాగితే మరిన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలం రహదారులు అన్ని పర్యాటకులతో సందడిగా మారాయి. ఈ సుందర దృశ్యాన్ని వీక్షించడానికి పర్యాటకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని సెల్ ఫోన్లో దృశ్యాలను చిత్రీకరిస్తున్నారు. గేట్లు మూసివేసిన తర్వాత బోటు సర్వీసులు పునరుద్ధరిస్తామని అధికారులు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగస్టు 1న శ్రీశైలం ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేయనున్నారు. శ్రీశైలం ఆనకట్ట సమీపంలో కృష్ణా నదికి జలహారతి కూడా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.