తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రెండు రోజుల పాటు ఈ రెడ్ అలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంటే, ఆగస్టు 31, సెప్టెంబర్ 1. శని, ఆదివారాలు, ఈ రెండు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం ప్రభావంతో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడనున్నాయి.నల్గొండ, నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి.
మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగస్టు 31వ తేదీ శనివారం మధ్యాహ్నం వరకు నారాయణపేటలో 13 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సెప్టెంబర్ 1 తెల్లవారుజామున విశాఖపట్నం-గోపాలపూర్ మధ్య తీరం దాటనుందని. తుఫాను తీరం దాటిన 24 గంటల వరకు ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని తెలంగాణ వాతావరణ శాఖ స్పష్టం చేసింది.