తెలుగు రాష్ట్రాలకు మరో పెను ప్రమాదం పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. అది క్రమంగా బలపడి ఉత్తరాంధ్ర వైపు వెళ్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సమాచారం. గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తూర్పు, ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురువనున్నాయి. నాలుగు రోజుల క్రితం కురిసిన వర్షం నుంచి ఇంకా తేరుకోక ముందే బెజవాడ మరో వాయుగుండంతో గజగజలాడబోనుంది.
ప్రస్తుతం నీటిలో మునిగిన విజయవాడ నగరం ఇంకా నీటి నుంచి బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో విజయవాడ వాసులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రత్యేక సాయం అందిస్తోంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ అక్కడి పరిస్థితులను తెలుసుకొని సహాయక చర్యలను చేపట్టిస్తున్నారు.