కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిర్దిష్ట గడువులోగా పాకిస్తాన్ పౌరులు భారత్‌ను విడిచి వెళ్లాలని స్పష్టంగా తెలిపింది. పాక్ పౌరులు దేశం విడిచేందుకు ఇవాళ, అంటే ఏప్రిల్ 29, చివరి తేదీగా ప్రకటించింది. మెడికల్ వీసాలపై భారత్‌లో ఉన్నవారికీ ఇదే గడువు వర్తిస్తుందని పేర్కొంది. ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే, వారి మీద చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న పాక్ పౌరులు స్వదేశానికి తిరిగి వెళ్తున్నారు.
ఇదిలా ఉండగా, కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలోని స్పెషల్ బ్రాంచ్‌లో నమోదైన పాక్ పౌరుల వివరాలను అధికారులు సమీక్షించారు. రాష్ట్ర డీజీపీ జితేందర్, కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలను అనుసరించి, రాష్ట్రంలో ఉన్న పాక్ పౌరులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తాన్ పౌరులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని, లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇప్పటికే నలుగురు పాకిస్తానీలు హైదరాబాద్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయారు. వారిలో ఒక పురుషుడు, ఒక మహిళ, ఆమె కుమార్తెతో పాటు మరో మహిళ ఉన్నారు.