ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఒకటో తేదీన పేదల సేవల పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఈ కార్యక్రమం ద్వారా అధికారులు పేదల స్థితి గతులను తెలుసుకోవాలని ఆదేశించారు. ఏం చేస్తే ప్రజలు పేదరికం నుంచి బయటపడతారో ఆలోచించాలని కలెక్టర్లకు ఆదేశించారు. పేదలతో మాట్లాడాలని, వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టాలని కలెక్టర్ల సదస్సులో మార్గనిర్దేశం చేశారు. బాగా పనిచేసే జిల్లా కలెక్టర్లను ప్రోత్సహిస్తామని, పాలనలో స్థిరత్వం కోసం అవసరమైతే ఐదారేళ్లూ వారినే కొనసాగిస్తామని చంద్రబాబు స్పష్టంచేశారు. సమర్థంగా పనిచేయని వారికి గ్యారంటీ ఇవ్వలేమని పేర్కొన్నారు.
కలెక్టర్లు ప్రజలతో గౌరవంగా మసులుకోవాలని, లేదంటే ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందన్నారు. మా ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు. అలాగని తప్పు చేసిన వారిని వదిలిపెట్టబోమని తేల్చి చెప్పారు. తప్పు చేసిన వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రులు, కలెక్టర్లు, సీనియర్ కార్యదర్శులు సహా అందరూ క్షేత్రస్థాయిలో పర్యటించాలని, మారుమూల ప్రాంతాలకు వెళ్లి ప్రజల స్థితి గతులను తెలుసుకోవాలని సూచించారు.