తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షలో భాగంగా ఆయన ఈరోజు విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టారు. వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా ఉప ముఖ్యమంత్రి ఆలయ మెట్లను నీటితో శుభ్రం చేశారు. అనంతరం మెట్లకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బాలశౌరి, కేశినేని శివనాథ్ (చిన్ని), ఎమ్మెల్సీ హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 1న తిరుమలలో ప్రాయశ్చిత్త దీక్షను పవన్ విరమించనున్నారు. దీనికోసం ఆయన తిరుపతి నుంచి అలిపిరి మెట్ల మార్గంలో తిరుమలకు నడుచుకుంటూ వెళ్లనున్నారు. 2వ తేదీన వెంకటేశ్వరుడిని దర్శించుకున్న తర్వాత దీక్ష విరమించనున్నారు.