కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. ధూప-దీప-నైవేద్యాలకు నోచుకోని అనేక దేవాలయాలను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని ప్రశంసించారు. కరీంనగర్‌లో చేపట్టిన టీటీడీ ఆలయ నిర్మాణానికి తగిన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
2023లో కరీంనగర్‌లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే సంవత్సరం మే 31న 10 ఎకరాల స్థలంలో శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని బండి సంజయ్ తెలిపారు. అయితే, ఆ తర్వాత ఆలయ నిర్మాణం వైపు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఆయన అన్నారు. కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల భక్తులు టీటీడీ నిర్మించే ఆలయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని, ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.