దేశం దృష్టిని ఆకర్షించిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం ప్రారంభమైంది. మరికొద్ది గంటల్లో తొలి ఫలితాలు రానుండగా, మధ్యాహ్నం ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థులు తమ సత్తా చాటుతున్నారు. కాషాయ పార్టీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఆప్ అభ్యర్థులు 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. కాగా, ఓట్ల లెక్కింపునకు మొత్తం 19 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 10 వేల మంది పోలీసులను మోహరించారు.
ఢిల్లీలోని మొత్తం 70 స్థానాలకు ఈ నెల 5న ఎన్నికలు జరిగాయి. 60.54 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ మార్కు 36. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా, కేజ్రీవాల్ వాటిని కొట్టిపడేశారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే నాలుగోసారి ప్రభుత్వాన్ని పాలిస్తుంది. మరోవైపు ఢిల్లీ పీఠానికి చాలా కాలంగా అంటే దాదాపు రెండున్నర దశాబ్దాలుగా దూరంగా ఉన్న బీజేపీ గెలుపు ఖాయమనే ధీమాతో ఉంది.