తిరుమలలో రూ.13.40 కోట్లతో నిర్మించిన వకుళామాత వంటశాలను సీఎం చంద్రబాబు నేడు ప్రారంభించారు. భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. 1.25 లక్షల మందికి అన్నప్రసాదాన్ని ఈ వంటశాల ద్వారా అందించవచ్చని వెల్లడించారు. 18 వేల మందికి అరగంటలో ఒక రకం వంటకాన్ని ఈ కిచెన్ ద్వారా అందించవచ్చని పేర్కొన్నారు. తరిగొండ వెంగమాంబ, అక్షయ, వకుళమాత వంటశాలలతో 3 లక్షల మందికి అన్నప్రసాదం అందించవచ్చని శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మెరుగైన సేవలందించేలా ఆధునిక కిచెన్ లు ఏర్పాటు చేశామని చంద్రబాబు స్పష్టం చేశారు.
అన్నదానం, ప్రాణదానం కార్యక్రమాలను మరింత క్రమబద్ధీకరణ చేస్తాం. క్యూ లైన్ల నిర్వహణను కూడా సరిగా చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం. పరిశుభ్రత, ప్రసాదం నాణ్యత, మేనేజ్ మెంట్ లో కూడా మార్పు వచ్చింది. దీంతో భక్తులు హర్షిస్తున్నారు’’ అని సీఎం పేర్కొన్నారు. శ్రీవారి ప్రసాదం నాణ్యత విషయంలో రాజీపడబోమని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ప్రసాదం బాగోలేదని చాలాసార్లు భక్తులు ఆందోళన చేస్తే నాటి పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం పూర్తి ప్రక్షాళన చేపట్టామని.. భక్తుల అభిప్రాయాన్ని తీసుకుంటామన్నారు. వెంకటేశ్వరస్వామి లడ్డు ప్రపంచంలో ఎవరూ ఎక్కడా తయారు చేయలేకపోయారు. దీనికి పేటెంట్ కూడా ఉంది. పవిత్రమైన శ్రీవారి లడ్డు, జిలేబీ, మైసూర్ పాక్, వడకు ప్రత్యేకత ఉంది అని చంద్రబాబు వివరించారు.