హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపనకు సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు భూమిపూజ చేశారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ అధినేత కె.కేశవరావు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ, భూమిపూజ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించేందుకు సమయం లేదన్నారు. కొన్ని రోజుల వరకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో నేటి ముహుర్తానికి భూమిపూజ చేసినట్లు వెల్లడించారు. సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారమైందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
ఆశయసిద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని తెలంగాణ ఉద్యమం చెబుతోందని అన్నారు. ఇచ్చిన మాటను సోనియమ్మ మాట నిలబెట్టుకోవడం వల్లే 2014లో తెలంగాణ రాష్ట్రం అవతరించిందని వివరించారు. కానీ, గత సర్కారు పదేళ్ల పాటు తెలంగాణ తల్లి ఊసే లేకుండా వ్యవహరించిందని, తెలంగాణ తల్లిని మరుగునపడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లి కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేసుకున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. కాగా, తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైన డిసెంబరు 9వ తేదీ అంటే తెలంగాణ ప్రజలకు పండుగ రోజు అని, ఆ రోజునే తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. మిలియన్ మార్చ్ తరహాలో భారీ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు.