హైదరాబాద్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 20న ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో భేటీ కానున్నారు. మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజ్‌‌లపై ఎన్డీఎస్‌ఏతో ఉత్తమ్ చర్చించనున్నారు. ఎన్డీఎస్ఏ అధికారులతో పలు ప్రాజెక్ట్‌లకు సంబంధించిన విషయాలపై ఆరా తీయనున్నారు. వర్షాల నేపథ్యంలో డ్యామ్‌ల వద్ద తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులపై సమీక్ష చేయనున్నారు. ఢిల్లీ పర్యటనకు సంబంధించిన వివరాలను ఈరోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 28 వేల కోట్లను కేటాయింపులు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పుల వడ్డీకి రూ. 18 వేల కోట్లు పోతున్నాయని తెలిపారు. ఈ పనుల వ్యయం కోసం బడ్జెట్‌లో రూ.11 వేల కోట్లు కేటాయించాలని ఆర్థిక శాఖను కోరుతున్నామని చెప్పారు.

పాలమూరు జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను 2025 డిసెంబర్ 25 నాటికి పూర్తి చేస్తామన్నారు. డిండి కూడా తమ ప్రణాళికలో ఉందని వివరించారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు బడ్జెట్‌ను రూపొందించి ఆర్థిక శాఖకు పంపుతున్నామని అన్నారు. సమ్మక్క ప్రాజెక్టు కోసం చత్తీస్‌గఢ్‌తో భూమి కోసం సంప్రదింపులు జరుపుతామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాజెక్టుల వద్ద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. బ్యారేజీకి సంబంధించిన ఇరిగేషన్‌ అధికారులతో సమావేశమై పలు అంశాలపై ప్రత్యేకంగా సమీక్షిస్తుంది. భారీవర్షాలు పడితే ప్రాజెక్ట్‌లకు ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందా అనే కోణంలోనూ అధికారుల నుంచి మంత్రి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్ట్‌లపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్ట్‌లకు కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ప్రాధాన్యం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *