కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న తెలంగాణ విమోచన వేడుకలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకావడం లేదు. దీంతో కేంద్రంలోని సీనియర్ మంత్రిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్వయంగా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. మూడేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన వేడుకలను అధికారికంగా నిర్వహిస్తోంది.అయితే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజాస్వామ్య దినోత్సవం అనే కార్యక్రమాన్ని చేపడుతోంది.

అమిత్ షా ప్రస్తుతం జమిలి, హర్యానా ఎన్నికలతో బిజీగా ఉన్నారని, అందుకే ఈ వేడుకలకు హాజరవలేక పోతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 17న పరేడ్ గ్రౌండ్ లో విమోచన వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కిషన్ రెడ్డి, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరయ్యే అవకాశం ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా పాల్గొంటారు. వేడుకల ఏర్పాట్లను బీజేపీ ఎంపీలు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న తెలంగాణ ప్రజాస్వామిక దినోత్సవ వేడుకలకు రావాల్సిందిగా కేంద్రమంత్రులు అమిత్ షా, షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *