స్థానిక సంస్థలు, శాసనసభల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి జనాభా గణన నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన బీసీ సంఘాల ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీసీల గొంతుకను వినిపించడానికే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనాభా పరిమాణం తెలియకుండా రిజర్వేషన్లు ఇవ్వలేమని కోర్టులు స్పష్టం చేశాయని ఆయన గుర్తు చేశారు.
జనగణనతో పాటు కుల గణనను నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని ఆయన పేర్కొన్నారు. దామాషా ప్రకారం నిధులు, నియామకాలు కేటాయించడమే తమ పార్టీ విధానమని ఆయన స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి బీసీలను బలోపేతం చేసే ఉద్దేశ్యం లేదని విమర్శించారు. దేశంలో జనగణనతో పాటు కుల గణన నిర్వహించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు.