కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ని నియమించింది. ఈ హైడ్రా, చెరువులను ఆక్రమించి, అక్రమ కట్టడాలను చేసిన వాటిని కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అక్రమ నిర్మాణాల కూల్చివేతలే ధ్యేయంగా, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్ల పరిరక్షణే లక్ష్యంగా నెలకొల్పబడిన ’హైడ్రా‘ (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) హైడ్రా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ హైడ్రా హైదరాబాద్ వరకు మాత్రమే పరిమితమని తెలిపారు. జిల్లాల నుంచి అనేక వినతులు వస్తున్నప్పటికీ హైడ్రా హైదరాబాద్ వరకే పరిమితం అవుతుందని స్పష్టం చేసారు. చెరువులను, నాలాలను ఆక్రమించినా ఏ నిర్మాణాన్ని అయినా కూల్చివేస్తామని తెలిపారు. తొలుత తమ పార్టీకి చెందిన పల్లంరాజు ఫామ్ హౌస్ ను కూల్చివేశామని పేర్కొన్నారు.
ఎఫ్‌టీఎల్ పరిధిలో తమ బంధువుల నిర్మాణాలు ఉన్న, తానే కూల్చివేస్తానని తెలిపారు. జువ్వాడ ఫాం హౌస్ ను కేటీఆర్ లీజుకు తీసుకున్నానని చెబుతున్నారని, అదే జరిగితే ఎన్నికల అఫడవిట్ లో ఎందుకు వెల్లడించలేదని మండి పడ్డారు. చెరువులు, పార్కులు, నాలాలపై ఆక్రమణల తొలగింపునకే ప్రస్తుతం హైడ్రా పరిమితమవుతుందని తెలిపారు. నగరంలో జలాశయాలను పరిరక్షించడమే తమ ధ్యేయమని తెలిపారు.