తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈరోజు (మార్చి 6) మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదిక ఆమోదం పొందే అవకాశం ఉంది. ఎస్సీ వర్గీకరణను ఆమోదించడానికి అవసరమైన బిల్లులను అసెంబ్లీ ఆమోదించనుంది. బీసీ గణనకు మరోసారి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో నమోదైన వారి వివరాలతో తుది గణనను మంత్రివర్గం ఆమోదించనుంది. విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచడం, రాజకీయ రిజర్వేషన్లు కల్పించడం వంటి బిల్లులకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు, బడ్జెట్ సమావేశాల తేదీలను మంత్రి మండలి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
అయితే, బడ్జెట్ సమావేశాలు ఏ రోజున ప్రారంభమయ్యేది, బడ్జెట్ ప్రవేశ పెట్టే తేదీలతో పాటు తదితర అంశాలను తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఖరారు చేయనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజున ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్ ప్రసంగానికి సైతం మంత్రి మండలి ఆమోద ముద్ర వేయనుంది. దీంతో పాటుగా నూతన టూరిజం పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వివిధ శాఖలకు సంబంధించిన కొత్త పోస్టులు సృష్టించడం, వాటిని ఆమోదించడం చేయనున్నారు. వీటితో పాటు మరికొన్ని కీలక అంశాలకు రేవంత్ రెడ్డి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది.