తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించారు. శుక్రవారం ఆయన హుజూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 85 శాతం మందికి సన్నబియ్యం అందుతాయని ఆయన అన్నారు. చాలా మంది రేషన్ బియ్యాన్ని ఉపయోగించడం లేదని, దొడ్డు బియ్యం తినలేక కొందరు బ్లాక్ మార్కెట్‌లో అమ్ముతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రేషన్ షాపులో బియ్యంతో పాటు త్వరలో కందిపప్పు, ఉప్పు లాంటి ఇతర నిత్యావసర వస్తువులు ఇస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ పొందేందుకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అర్హత ఆధారంగా అవసరమైనంత మందికి కొత్త రేషన్ కార్డులు అందిస్తామని వెల్లడించారు. రేషన్ కార్డు లేకపోయినా, లబ్ధిదారుల జాబితాలో పేరు ఉంటే బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి తెలిపారు.