మరికొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. నాలుగోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న తొలి తెలుగు సీఎం ఆయనే. తాజా సమాచారం ప్రకారం జూన్ 12వ తేదీన గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో బాబు ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ఉదయం 11:27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఈ భారీ ఈవెంట్ కోసం మెగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు, ప్రముఖ నాయకులు హాజరుకానున్నారు. వేదిక వద్ద ఏర్పాట్లను టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. బాబు ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు మరికొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీతో పాటు టీడీపీ అఖండ విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలకు గాను 164, 25 లోక్‌సభ స్థానాలకు గాను 21 స్థానాలను కూటమి గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇదే అతిపెద్ద విజయం.