పారిస్‌లో జ‌రుగుతున్న పారాలింపిక్స్‌లో భార‌త అథ్లెట్లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న‌తో దూసుకెళ్తున్నారు. ప‌త‌కాల పంట పండిస్తున్నారు. ఇటీవల జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ ఫైనల్లో ఆర్చర్ హర్విందర్ సింగ్ స్వర్ణం సాధించాడు. ఏకపక్షంగా సాగిన ఈ ఫైనల్‌లో పోలాండ్‌కు చెందిన లుకాస్జ్ సిజెక్‌ను 6-0తో ఓడించాడు. దీంతో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మొదటి భారతీయ ఆర్చర్‌గా హర్విందర్ సింగ్ చరిత్ర సృష్టించాడు. ఒలింపిక్స్‌లో కూడా భారత్‌కు ఇప్పటి వరకు ఆర్చరీలో బంగారు పతకం రాలేదు. మూడేళ్ల క్రితం టోక్యోలో జరిగిన పారాలింపిక్స్‌లో 33 ఏళ్ల హర్విందర్ కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా ఆర్చరీలో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.

టోక్యో పారాలింపిక్స్ 2020లో భారత్ 19 పతకాలు సాధించింది. దాంతో ఈసారి 25 ప‌త‌కాలే ల‌క్ష్యంగా బ‌రిలోకి దిగింది టీమిండియా. దానికి త‌గ్గ‌ట్టుగానే భార‌త అథ్లెట్లు రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం భార‌త్ ఖాతాలో 24 ప‌త‌కాలు చేరాయి. మ‌రో ప‌త‌కం సాధిస్తే టార్గెట్‌ను అందుకుంటుంది. ఇందులో 5 స్వర్ణాలు, 9 రజతాలు, 10 కాంస్య పతకాలు ఉన్నాయి. మొత్తంగా ప‌త‌కాల ప‌ట్టిక‌లో భార‌త్ 13వ స్థానంలో కొన‌సాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *