రాష్ట్ర ఎన్నికల సమయంలో పల్నాడులో త్రీవ ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. నేడు మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ నేతల కాన్వాయ్‌పై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. కర్రలతో వైసీపీ నేతల కార్లపై దాడి చేయడంతో ఒక కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. 14వ మైలు దగ్గర ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. ఆందోళనకారులను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు.
పెదకూరుపాడు మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు వరద ముంపు గ్రామాల పరిశీలనకు వెళ్తున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దింతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ కారణంగా 14వ మైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. ముంపు ప్రాంత బాధితులను పరామర్శించడం తప్పా అని నంబూరు శంకర్రావు ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని ఆరోపించారు. ఇదంతా ప్లాన్ ప్రకారం చేసిన దాడి అంటూ మండిపడ్డారు. ఈ ఉద్రిక్తత నేపథ్యంలో నంబూరు శంకర్రావు గుంటూరుకు వెళ్లిపోయారు.