హావేరి: బ్యాడగి తాలూకాలోని గుండెనహళ్లి క్రాస్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ట్రక్కును ఢీకొన్న ప్రమాదంలో 13 మంది మృతి చెందగా, మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో హవేరి జిల్లా బైడగిలో జాతీయ రహదారి 48 పక్కన ఆగి ఉన్న ట్రక్కును వ్యాన్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వ్యాన్లో మొత్తం 17 మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో 11 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ఆసుపత్రిలో మరణించినట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన నలుగురిలో ఇద్దరిని ఆస్పత్రిలోని ఐసీయూలో ఉంచినట్లు తెలిపారు. బాధితులు చించోలి మాయమ్మ దేవస్థానం నుంచి వచ్చి శివమొగ్గ జిల్లాలోని యెమెహట్టి గ్రామానికి వెళ్తున్నారు. ట్రక్కు హైవే పక్కన నిలబడి ఉంది. టెంపో ట్రావెలర్ ట్రక్కును వెనుక నుంచి ఢీకొట్టింది' అని హవేరి సూపరింటెండెంట్ అన్షు కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. మృతదేహాలను మార్చురీకి తరలించి, క్షతగాత్రులను హవేరి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు.